కష్టకాలంలో బీఆర్‌ఎస్‌..!


(ప్రజాతీర్పు ప్రతినిధి, హైదరాబాద్‌)
బీఆర్‌ఎస్‌.. నిన్నటి వరకు ఇదో సంచలనం.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పార్టీ, పార్టీ అధినేత పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వరస పరాజయాలు. తాజాగా విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై కేసీఆర్‌కు నోటీసులతో పార్టీ పరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ మళ్లీ కోలుకోవడం కష్టమే అన్న భావనను కొందరు వ్యక్తం చేస్తుండగా. పీనిక్స్‌ పక్షిలా మళ్లీ ఎగురుతామని పార్టీ నేతలతో పాటు అభిమానులు అంటున్నారు.
అధికారంలో పదేళ్లు..
పదేళ్లు వెలుగు వెలిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాజా పరిస్థితి నుంచి గట్టెక్కే మార్గం ఉందా? అన్న అంశం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా వచ్చిన టిఆర్‌ఎస్‌ పార్టీ, రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి పదేళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగించింది. తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌ పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారు. ప్రతిపక్ష పార్టీలను చావు దెబ్బ కొట్టేలా, ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను ఆహ్వానిస్తూ, ప్రతిపక్షాలలో కీలక నాయకులు లేకుండా చేసి తీవ్రమైన దెబ్బ కొట్టారు. ఇక రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని పార్టీగా భావించి, దేశ రాజకీయాలను చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీని టీఆర్‌ఎస్‌ పార్టీగా మార్చారు.
వరుస దెబ్బలు..
ఒకదశలో దేశ్‌కీ నేత కేసీఆర్‌ అంటూ ప్రధాని రేసులో కేసీఆర్‌ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక 10 ఏళ్లపాటు కేసీఆర్‌ పాలన చూసిన తెలంగాణ ప్రజలు గత ఎన్నికలలో ఊహించని విధంగా కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలలో మాత్రమే కాదు, జరిగిన లోక్‌సభ ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సైతం బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు ఊహించని షాకిచ్చారు. లోక్‌సభ ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా రాకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ ఘోర పరాభవం చూడాల్సి వచ్చింది. ఒకవైపు కేసీఆర్‌ కుమార్తె కవిత ఢల్లీి లిక్కర్‌ కుంభకోణం కేసులో తీహార్‌ జైల్లో ఉండడం, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్‌ టాపింగ్‌ కేసు విచారణలో కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌ ఉన్నారని ప్రత్యర్థి పార్టీలు టార్గెట్‌ చేయడం తలనొప్పిగా మారింది. అంతటితో ఆగకుండా కరెంట్‌ కొనుగోళ్ల విషయంలో నోటీసులు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పట్లో తేరుకోవడం కష్టమే అన్న భావన వ్యక్తమవుతోంది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప, మళ్లీ బీఆర్‌ ఎస్‌ పార్టీ గత ప్రాభవాన్ని సంపాదించలేదు అనేది రాజకీయ విశ్లేషకుల టాక్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *