Wednesday, January 7, 2026
advt
Homeతాజా వార్తలుమార్వాడీలు వెళ్లిపోవాలా!

మార్వాడీలు వెళ్లిపోవాలా!

తెలంగాణ‌లో గో బ్యాక్ మార్వాడీ ఉద్య‌మం!
సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం
రాష్ట్రంలో అన్ని వ్యాపారాల‌ను మార్వాడీలే..
ఆక్ర‌మించుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు
స్థానికుల‌కు ఉపాధి లేకుండా చేస్తున్నార‌ని మండిపాటు
ఆమ‌న‌గ‌ల్లులో జ‌రిగిన ఘ‌ట‌న‌తో తీవ్ర‌త‌రం
మార్వాడీల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌
హిందువుల‌ను చీల్చే కుట్ర జ‌రుగుతోంద‌ని ఫైర్‌
మార్వాడీలు మ‌న‌లో ఒక‌ర‌న్న పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్‌

తెలంగాణ‌లో మ‌రో ఉద్యమం పురుడు పోసుకుంటోంది. మార్వాడీలు తెలంగాణ‌ను వ‌దిలి వెళ్లాల‌నే డిమాండ్‌ను కొంద‌రు వినిపిస్తున్నారు. గో బ్యాక్ మార్వాడీ అంటూ సోష‌ల్‌ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు మార్వాడీల దుకాణాల్లో వ‌స్తువులు కొన‌వ‌ద్దంటూ పిలుపునిస్తున్నారు. వారు ఇక్క‌డికి వ‌చ్చి వ్యాపారాలు చేస్తూ స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నార‌ని, వ‌స్తువుల‌ను అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తూ దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. అయితే ఆమ‌న‌గ‌ల్లులో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘ‌ట‌నే ఈ ఉద్య‌మానికి కార‌ణ‌మైంద‌ని తెలుస్తోంది.

హైదరాబాద్, ఆగస్టు, (ప్రజాతీర్పు)

గ‌తంలో ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఉండి.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివారులోకి వచ్చిన ఆమ‌నగల్లులో.. ఓ దుకాణం ముందు పార్కింగ్ విష‌యంలో గొడవ జరిగింది. బైక్ పార్కింగ్ చేసిన యువకుడితో దుకాణాదారు గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవలో దుకాణ యజమాని బంధువు.. బైక్‌ పార్కింగ్ చేసిన వ్యక్తిని కొట్టాడు. ఆ దుకాణదారు మార్వాడీ కాగా, పార్కింగ్ వివాదంలో అతను కొట్టింది.. ఓ దళిత యువకుడిని. ఘర్షణ పడినప్పుడు వారికి సంబంధించిన ఈ వివరాలేమీ ఎవ‌రికీ తెలియవు. కానీ, ఇప్పుడు వాటితోనే అసలు వివాదం ప్రారంభమయింది. ఇది రాష్ట్రం మొత్తానికి పాకుతోంది. అమనగల్లులో మార్వాడీల వ్యాపారాలు ఎక్కువ అయిపోయాయని, స్థానికలకు వ్యాపారాలు లేకుండా మొత్తం వారే అక్రమించుకుంటున్నారని..పైగా దోచుకుంటున్నారని , దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఈ నెల 18న ఆమనగల్లు బంద్ కు స్థానికులు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఇది ప్ర‌చారం కావ‌డంతో చాలా మంది మార్వాడీ గోబ్యాక్ నినాదాలను సామాజిక మాధ్య‌మాల్లో షేర్‌ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్లా మార్వాడీలే ఉంటున్నారని.. తెలంగాణ ప్రజలకు చిరు వ్యాపారాలకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని.. ప్రతి చిన్న ఊరిలోకి వచ్చి వ్యాపారాలు పెట్టేస్తున్నారని ప్రచారం ప్రారంభించారు.

క‌ళాకారుడి అరెస్టుతో తీవ్ర రూపం..
మార్వాడీ గో బ్యాక్ ప్ర‌చారానికి మ‌ద్ద‌తుగా గోరేటి ర‌మేశ్‌ అనే వ్యక్తి ఓ పాట పాడ‌టంతో ఆయ‌న‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోరేటి ర‌మేశ్ గ‌తంలో ప్రజానాట్యమండ‌లిలో పనిచేశారు. దీంతో ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన‌వారు, ప్రజాస్వామ్యవాదులు అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారంతా మార్వాడీల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌డం మొద‌లుపెట్టారు. స్థానికులు దుకాణాలు పెట్టుకుంటే ఇక్కడివారికి పని కల్పి్స్తారని, అదే మార్వాడీలు తమ వాళ్లనే పనిలో పెట్టుకోవడంతో పాటు ఇక్కడి దుకాణాదారులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని అంటున్నారు. అంతేకాకుండా హోల్‌ సేల్ మార్వాడీ వ్యాపారులు స్థానిక దుకాణదారులకు ఎక్కువ రేటుకు వస్తువులను విక్ర‌యిస్తూ, మార్వాడీ దుకాణదారులకు మాత్రం తక్కువ రేటుకు అమ్ముతున్నారని చెబుతున్నారు. ఇదివరకు మార్వాడీలు కేవలం బంగారం, హోల్ సేల్ కిరాణం, స్వీట్ హౌజ్ వ్యాపారం మాత్రమే చేసే వారని, ఇప్పుడు అన్ని వ్యాపారాల్లో దూరి స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో స్థానికుల్లో మార్వాడీల‌కు వ్యతిరేకంగా అభిప్రాయాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

నిజానికి తెలంగాణలో మార్వాడీ వ్యాపారులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు కిరాణా దుకాణాల నుంచి నిర్మాణ సామాగ్రి , స్వీట్ షాపులు, హోటళ్ల వరకూ విస్తరించారు. వీరి వల్ల తమ వ్యాపార అవకాశాలు దెబ్బ‌తింటున్నాయ‌ని, జీవనోపాధిని కూడా కోల్పోతున్నామ‌నే వాద‌న‌లు స్థానిక తెలంగాణ వ్యాపారులు, ముఖ్యంగా చిన్న వ్యాపారుల నుంచి అప్పుడప్పుడూ వస్తున్నాయి. ఇప్పుడు ఆమ‌న‌గ‌ల్లులో పార్కింగ్ వివాదంతో ఇది పెద్దదయింది. రాష్ట్రంలోని ప్ర‌తి ప‌ట్ట‌ణం, న‌గ‌రంలో మార్వాడీల దుకాణాలు ఉండ‌డంతో అన్ని చోట్లా ఈ అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఆంధ్రా గో బ్యాక్ పూర్త‌యింది.. ఇక‌పై మార్వ‌డీ గో బ్యాక్ అనాల్సిందేనంటూ కొంద‌రు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఇది రాజ‌కీయంగా కూడా ప్రాధాన్య అంశంగా మారిపోయింది. అన్ని పార్టీల వారికి అవ‌స‌రమైన సంద‌ర్భంగా మార్వాడీల నుంచి స‌హ‌కారం అందుతుంద‌నే అభిప్రాయాలున్నా.. స్థానికుల‌కు సంబంధించిన అంశం కావ‌డంతో ఏ పార్టీ ఎటువైపు మొగ్గుతుంద‌న్న‌ది కీల‌కంగా మారింది. అయితే ఈ విష‌యంలో బీజేపీ, ప్ర‌త్యేకించి ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత‌, కేంద్ర మంత్రి బండి సంజ‌య్.. మార్వాడీల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

హిందూ స‌మాజాన్ని చీల్చే కుట్ర‌: బండి సంజ‌య్‌
‘మార్వాడీ గో బ్యాక్’ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సంహాయ మంత్రి బండి సంజ‌య్ ఆరోపించారు. ‘మార్వాడీ గో బ్యాక్స‌ అంటూ ఎవ‌రైనా ఉద్య‌మం చేస్తామంటే.. తాము మటన్ దుకాణాలు, డ్రై క్లీనింగ్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వ‌స్తుందని హెచ్చరించారు. మార్వాడీలను లక్ష్యంగా చేసుకోవ‌డం కంటే.. హైద‌రాబాద్‌లో అక్ర‌మంగా నివాస‌ముంటున్న‌ బంగ్లాదేశీలు, రోహింగ్యాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి భారతీయుడికీ దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని స్ప‌ష్టం చేశారు. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. మార్వాడీలు వ్యాపారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. వారు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని, తెలంగాణను దోచుకోలేదని, వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారని అన్నారు. మార్వాడీలు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, అలాంటి వారు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా ఇదే అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. ఇక అధికార కాంగ్రెస్ సైతం మార్వాడీల‌కు మ‌ద్ద‌తుగానే స్పందించింది. మార్వాడీలు మ‌న‌లో ఒక‌ర‌ని, వారు ఎక్క‌డికీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ ఎస్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఈ అంశంపై స్పందించ‌లేదు. కానీ, ఈ ప్ర‌చారం ఎంత‌దూరం వెళుతుంద‌న్న‌దే ఇప్పుడు కీల‌కంగా మారింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -advt

Most Popular

Recent Comments