11న ఛలో హైదరాబాద్ : ఆర్ కృష్ణయ్య
టెట్ (TET) వేసి టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీ (DSC)ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్ (Chalo Hyderabad) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య (R Krishnaiah) తెలిపారు. డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించడం అనవాయితీగా వస్తుందని, పక్క రాష్ట్రాల్లో టెట్ వేసిన విషయం ప్రభుత్వం గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్ రాసి ఉత్తీర్ణత సాధించకుండా టీచర్ పోస్టు రాయడానికి అర్హత రాదని, నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టెట్ నిర్వహించాలని కోరారు. టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. టెట్ నిర్వహించి ఆరు నెలలు అవుతుందని, అందులో పది శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని, ఈ నేపధ్యంలో మరోమారు టెట్ నిర్వహించాలని కోరారు.