సీఎం సోదరుడికి హైడ్రా నోటీసులు

(ప్రజాతీర్పు ప్రతినిధి, హైదరాబాద్‌)
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన హైడ్రా రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతోంది. చెరువులు, చెరువు శిఖం భూముల్లో ఎవరున్నా.. వదలడం లేదు. తాజాగా.. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి కూడా కూల్చివేత నోటీసులు అంటించారు. నగరంలోని దుర్గంచెరువు చుట్టూ అక్రమ కట్టడాలు ఎన్నో వెలిశాయి. అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు, కార్యాలయంతో సహా పలు ప్రముఖ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని 30 రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టార్స్‌ కాలనీ, డాక్టర్స్‌ కాలనీ, కావూరి హిల్స్‌, అమర్‌ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద ఈ నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని నిర్ణీత గడువులోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశించారు. లేదంటే అధికారులే కూల్చివేతలు చేపడతారని హెచ్చరించారు. హైడ్రా నోటీసులపై సీఎం రేవంత్‌ సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్‌సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు సమయంలో ఎఫ్‌టీఎల్‌లో ఉందనే సమాచారం లేదని.. ఆ పరిధిలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *