మద్యం ధరలకు రెక్కలు

త్వరలో రేట్ల పెంపు
కసరత్తు చేస్తున్న సర్కార్‌
(ప్రజాతీర్పు ప్రతినిధి, హైదరాబాద్‌)
తెలంగాణలో మరోసారి మద్యం ధరలకు రెక్కలు రానున్నాయి. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం మద్యం ధరలు పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు గత వారమే ఈ దిశగా చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గడిచిన 5 ఏళ్లలో చూసుకుంటే..తెలంగాణలో మద్యం ధరలు పెంచడం ఇది మూడోసారి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇదే తొలిసారి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020, 2022లో మద్యం ధరలు పెంచింది. ఇక హామీల అమలుకు ఆదాయ సమీకరణపై దృష్టిపెట్టిన రేవంత్‌ సర్కార్‌ ఇప్పటికే భూముల ధరలు సవరించి..రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచాలని ప్లాన్‌ చేసింది. తాజాగా లిక్కర్‌ ధరలతో పాటు కంపెనీలు, డిస్టిలరీస్‌ల రిజిస్ట్రేషన్‌ ఫీజుతో పాటు లైసెన్స్‌ ఫీజులను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై మరిన్ని చర్చలు జరిపిన తర్వాత క్లారిటీ రానుంది. గత కొన్నేళ్లుగా లిక్కర్‌ ద్వారా రాష్ట్రానికి ఏటా రూ. 30 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. 2014లో ఇది కేవలం రూ.10 వేల కోట్లుగా ఉండేది. తెలంగాణలో దాదాపు 500పైగా బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీఆర్‌ఎస్‌ లిక్కర్‌ ధరలను స్వల్పంగా తగ్గించింది. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌తో పాటు ఫారిన్‌ లిక్కర్‌పై స్పెషల్‌ ఎక్సైస్‌ సెస్‌- తగ్గించడంతో కొన్ని బ్రాండ్లపై ధరలు రూ.10 నుంచి రూ.40 వరకు తగ్గాయి.
కొత్త బ్రాండ్లకు తాత్కాలిక బ్రేక్‌
వేసవిలో బీర్ల కొరతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త బీర్ల విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అయితే, దీనిపై నెట్టింట.. మందుబాబుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఈ కొత్త బ్రాండ్లను తాత్కాలికంగా నిలిపివేయాలని సర్కార్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో సోమ్‌ డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కంపెనీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు రావడంతో సోమ్‌ డిస్టిలరీస్‌ రిజిస్ట్రేషన్‌ అనుమతిని రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *